Medical Tests | రక్త పరీక్షల ద్వారా మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయి, ఐరన్ నిల్వలు సరిపోతున్నాయా, శరీరంలో వాపు సూచనలు ఉన్నాయా వంటి అనేక విషయాలను తెలుసుకోవచ్చు. అయితే, వైద్య పరీక్షల నివేదికల్లో ఉండే సంఖ్యలు, వైద్య పదాల అర్థాలు చాలామందికి సులభంగా అర్థం కావు. అందువల్ల నివేదికలోని ఏ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలో తెలుసుకోవడం ముఖ్యం. పోషకాహార నిపుణురాలు నమామి అగర్వాల్ తన సూచనల్లో భాగంగా ఐదు ముఖ్యమైన ఆరోగ్య సూచికలను వివరించారు. అవి హెచ్‌బీఏ1సీ, ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు, ఫెరిటిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్, హోమా-ఐఆర్, హెచ్‌ఎస్-సీఆర్‌పీ. హెచ్‌బీఏ1సీ పరీక్ష గత మూడు నెలలుగా రక్తంలో చక్కెర స్థాయిలు సగటున ఎలా ఉన్నాయో తెలియజేస్తుంది. ఒకరోజు చేసిన పరీక్షలో వచ్చిన ఫలితాన్ని మాత్రమే కాకుండా, గత కొంతకాలంగా చక్కెర నియంత్రణ ఎలా ఉందో అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఎల్‌డీఎల్, హోమా-ఐఆర్..
ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు సాధారణంగా కొలెస్ట్రాల్ పరీక్షలో భాగంగా ఉంటాయి. ఎల్‌డీఎల్ ఒక రకమైన కొలెస్ట్రాల్ కాగా, ట్రైగ్లిజరైడ్లు రక్తంలో ఉండే కొవ్వు పదార్థాలు. వీటి స్థాయిల ద్వారా శరీరం కొవ్వులను, అదనపు కేలరీలను ఎలా వినియోగించుకుంటుందో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఫెరిటిన్ పరీక్ష శరీరంలో నిల్వ ఉన్న ఐరన్ పరిమాణం గురించి తెలియజేస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు సాధారణంగా ఉన్నప్పటికీ, ఫెరిటిన్ తక్కువగా ఉంటే శరీరంలో ఐరన్ నిల్వలు తగ్గినట్లు అర్థం అని భావించాలి. ఫాస్టింగ్ ఇన్సులిన్, హోమా-ఐఆర్ పరీక్షలు శరీరం ఇన్సులిన్‌ను ఎలా వినియోగించుకుంటుందో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. వీటి ద్వారా ఇన్సులిన్ నిరోధకతను ప్రారంభ దశలో గుర్తించేందుకు వైద్యులకు సహాయపడతాయి. ఇక హెచ్‌ఎస్-సీఆర్‌పీ అనేది శరీరంలో వాపు లేదా ఇన్‌ఫ్లమేషన్‌కు సంబంధించిన సూచిక. గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని అంచనా వేయడానికి వైద్యులు ఇతర ఆరోగ్య వివరాలతోపాటు ఈ ఫలితాన్ని కూడా పరిశీలిస్తారు.
ఈ విషయాలను గమనించాలి..
అయితే, రక్త పరీక్షల ఫలితాలను అర్థం చేసుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. పరీక్షకు ముందు తీసుకున్న ఆహారం, పానీయాలు, వాడుతున్న మందులు లేదా పోషకాహార సప్లిమెంట్లు, అధిక శారీరక వ్యాయామం వంటి అంశాలు కొన్ని పరీక్షల ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి. నెలసరి సమయంలో కూడా కొన్ని పరీక్షల ఫలితాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. అందుకే పరీక్షకు ముందు ఉపవాసం ఉండడం లేదా కొన్ని ఆహారాలను తీసుకోకుండా ఉండడం వంటి సూచనలు ఇస్తే వాటిని తప్పనిసరిగా పాటించాలి. పరీక్షకు ఎలా సిద్ధం కావాలో వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులు తెలియజేస్తారు. ఫలితాలు సాధ్యమైనంత కచ్చితంగా రావాలంటే వారి సూచనలను జాగ్రత్తగా అనుసరించాలి. వైద్య పరీక్షల నివేదికలను సరిగ్గా అర్థం చేసుకోవడం ద్వారా మన ఆరోగ్య పరిస్థితిని మరింత మెరుగ్గా తెలుసుకునే వీలు ఉంటుంది.






