CJP Protest : సీజేపీ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పలువురు ప్రముఖుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. ఢిల్లీలోనే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లో అక్కడి పోలీసులు అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు ప్రముఖుల్ని అదుపులోకి తీసుకున్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ సీజేపీ శనివారం ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా.. ఎలాంటి ఉద్రిక్తతలు, ఘర్షణ తలెత్తకుండా అనేక చోట్ల కీలక నేతల్ని అరెస్టు చేస్తున్నారు. శుకవ్రారం రాత్రి నుంచి ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు అరెస్టైన ప్రముఖులు వీరే. శనివారం మధ్యాహ్నం జంతర్ మంతర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన.. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌తోపాటు ఆ పార్టీ కీలక నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్ సహా పలువురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
అలాగే, ఏఐఎస్‌ఏ ప్రెసిడెంట్ నేహా బోరా, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జనరల్ సెక్రెటరీ దీపాంకర్ భట్టాఛార్య, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను ఐఎన్‌ఏ మార్కెట్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోనే ఉన్న సీఎం మమతా బెనర్జీతోపాటు ఆ పార్టీ ఎంపీలు డెరెక్ ఓబ్రియెన్, ప్రతిమా మండల్, దోలాసేన్ వంటి నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు ముంబై ఎయిర్‌పోర్టులో సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కేను అరెస్టు చేశారు. ఆయన ఎక్కడ ఉన్నారో కూడా వివరాలు తెలియదు.
అలాగే, సీజేపీ కీలక నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను కూడా అరెస్టు చేశారు. మరోవైపు ఢిల్లీ, ఆకాశవాణి భవన్ వద్ద పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య స్వల్ప ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో గంభీరమైన వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడికక్కడ సీజేపీ, ఆప్, వామపక్షాలు, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతల్ని అదుపులోకి తీసుకుంటుండటంతో ఆందోళనకర వాతావరణం ఉంది.






