- 641 మార్కులతో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్
- పరీక్ష రాసిన 2.65లక్షల మంది విద్యార్థులు
- త్వరలో కాళోజీ వర్సిటీ స్టేట్ కోటా మెరిట్ లిస్టు
- అక్టోబర్ 1 నుంచి వెబ్ సైట్లో స్కోర్ కార్డులు
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఆర్‌ఎన్‌బీ, పీజీ డిప్లొమా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) గురువారం విడుదల చేసింది. మొత్తం 720 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను, అభ్యర్థులు సాధించిన స్కోర్లు, ఆల్ ఇండియా ర్యాంకులను అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in లో అందుబాటులో ఉంచింది.
ఆగస్టు 30న దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు 2,63,544 మంది హాజరు కాగా, జైపూర్ లోని సీతాపుర పరీక్ష కేంద్రంలో విద్యుత్ అంతరాయం కారణంగా పరీక్ష రద్దయిన అభ్యర్థులకు సెప్టెంబర్ 5న నిర్వహించిన రీ-ఎగ్జామ్‌కు 2,416 మంది హాజరయ్యారు. నీట్ ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థికి 720 మార్కులకు 641 వచ్చాయి. బోర్డు రిలీజ్ చేసిన జాబితాలో పేర్లతో నిమిత్తం లేకుండా కేవలం రోల్ నంబర్ల క్రమంలో అభ్యర్థుల మార్కులు, ఆల్ ఇండియా ర్యాంకులను మాత్రమే వెల్లడించారు.
జనరల్, ఈడబ్ల్యూఎస్‌కు 262 కటాఫ్ స్కోర్
వివిధ కేటగిరీల కటాఫ్ పర్సంటైల్, అర్హత మార్కుల వివరాలను బోర్డు ఖరారు చేసింది. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 50వ పర్సంటైల్ ను అర్హతగా నిర్ణయించగా, కటాఫ్ స్కోరు 262 మార్కులుగా నిలిచింది. జనరల్–దివ్యాంగుల (పీడబ్ల్యూబీడీ) కేటగిరీకి 45వ పర్సంటైల్ అర్హత కాగా, కటాఫ్ 244 మార్కులుగా ఖరారైంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ (రిజర్వ్‌డ్ దివ్యాంగులతో కలిపి) అభ్యర్థులకు 40వ పర్సంటైల్‌తో 226 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉండటంతో దేశవ్యాప్తంగా చివరి ర్యాంకు 2,65,934 వద్ద ముగియగా, అత్యల్ప స్కోరు మైనస్ 19 (-–19) మార్కులుగా నమోదైంది.
త్వరలోనే... స్టేట్ మెరిట్ లిస్ట్
ప్రస్తుతం బోర్డు విడుదల చేసిన జాబితాలో జాతీయ స్థాయి ర్యాంకులు మాత్రమే ఉన్నాయి. ఆలిండియా ర్యాంకుల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర కోటా సీట్ల భర్తీ ప్రక్రియను కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ(కేఎన్ఆర్యూహెచ్ఎస్) చేపట్టనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి మెరిట్ జాబితాను వర్సిటీ త్వరలోనే రిలీజ్ చేయనుంది. అభ్యర్థులు తమ వ్యక్తిగత స్కోర్ కార్డులను అక్టోబర్ 1 నుంచి ఎన్‌బీఈఎంఎస్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.






