Netflix | ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 5 శాతం మందిని తొలగించాలని యాజమాన్యం ప్రణాళికలు రచిస్తోంది. దీనికి సంబంధించి వచ్చే వారంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ వార్తలపై నెట్‌ఫ్లిక్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ప్రస్తుతం మార్కెట్‌లో పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో నెట్‌ఫ్లిక్స్ తన వ్యాపార విధానాల్లో మార్పులు చేస్తోంది. యూట్యూబ్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌ల నుంచి తీవ్ర పోటీ ఎదురుకావడంతో, కంపెనీ తన వ్యూహాలను మార్చుకుంటోంది. ఇందులో భాగంగానే ఖర్చులను నియంత్రించుకోవడానికి ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఆదాయాన్ని పెంచుకునేందుకు లైవ్ ప్రోగ్రామింగ్, గేమింగ్ మరియు ప్రకటనల ఆధారిత ప్లాన్లపై నెట్‌ఫ్లిక్స్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. గతంలో 2022లో కూడా సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గడం, వ్యాపార వృద్ధి మందగించడం వల్ల నెట్‌ఫ్లిక్స్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. గతేడాది చివరి నాటికి ఈ సంస్థలో సుమారు 16 వేల మంది పూర్తికాలపు ఉద్యోగులు సేవలందిస్తున్నారు.






