
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సొంతంగా సరికొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే, ఈ కొత్త పార్టీ ప్రకటన కంటే.. అందుకోసం విజయసాయి రెడ్డి తెరవెనుక నడుపుతున్న పొలిటికల్ ఆపరేషన్ ఇప్పుడు వైసీపీ పునాదులను కదిలించేలా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
పార్టీలో ఒకప్పుడు అత్యంత బలంగా ఉండి, ప్రస్తుతం అంతర్గత పరిణామాల వల్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న అగ్రనేతలను టార్గెట్ చేస్తూ విజయసాయి రెడ్డి వేస్తున్న అడుగులు తాడేపల్లి వర్గాల్లో తీవ్ర కలవరాన్ని రేపుతున్నాయి. విజయసాయి రెడ్డి కేవలం ద్వితీయ శ్రేణి నాయకులను లేదా అసంతృప్తులను మాత్రమే కాకుండా.. వైసీపీకి క్షేత్రస్థాయిలో అసలైన పిల్లర్లుగా ఉన్న, బలమైన ఆర్థిక, సామాజిక అండదండలు ఉన్న అగ్రనేతలను టార్గెట్ చేయడం ఇక్కడ అత్యంత కీలకమైన అంశం. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడి, ఆ తర్వాత కొందరు కీలక నేతల ఏకపక్ష పెత్తనం వల్ల తీవ్రంగా నష్టపోయి, ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్న నేతలను విజయసాయి రెడ్డి ఐడెంటిఫై చేశారు.
ఒకప్పుడు పార్టీ కోసం అన్నీ తానై వ్యవహరించిన సాయిరెడ్డికి ప్రతి జిల్లాలోని బలమైన నేతలతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అదే సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుంటూ.. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ఆ బలమైన నాయకులతో విజయసాయి రెడ్డి నేరుగా టచ్‌లోకి వెళ్తున్నట్లు సమాచారం. పార్టీలో ఉంటూనే ప్రాధాన్యత లేక, భవిష్యత్తుపై క్లారిటీ లేక సతమతమవుతున్న రెడ్డి సామాజిక వర్గ అగ్రనేతలను తన వైపు తిప్పుకునేలా ఆయన పావులు కదుపుతున్నారు.
సమాజిక వర్గ సమీకరణలు, సాయిరెడ్డిపై ఉన్న నమ్మకం కలవడంతో.. రాయలసీమకు చెందిన కొందరు కీలక నేతలు ఇప్పటికే ఆయనతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఇన్నాళ్లూ అధికార కూటమి నుంచి వస్తున్న రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్న వైసీపీకి.. ఇప్పుడు సొంత పార్టీ మాజీ నంబర్-2 నుంచే, అది కూడా అత్యంత బలమైన నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ ముప్పు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. విజయసాయి రెడ్డి కేవలం పార్టీ పెట్టడమే కాకుండా, వైసీపీలోని అసలైన బలాన్ని లాగేసుకుని ఆ పార్టీకి డెడ్ ఎండ్ చూపించాలనే పక్కా స్కెచ్‌తో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
The post వైసీపీ కోటపై సాయిరెడ్డి సర్జికల్ స్ట్రైక్..? appeared first on Telugu Rajyam.





