SSEL EHV Power Transformer Export To America : విద్యుత్ ప్రసార రంగంలో తన అంతర్జాతీయ విస్తరణను మరింత బలోపేతం చేసుకుంటూ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (SSEL) మరో కీలక మైలురాయిని చేరుకుంది. అమెరికా మార్కెట్‌కు తన తొలి 175 ఎంవీఏ, 345 కేవీ ఎక్స్‌ట్రా హై హోల్టేజ్ (EHV) పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను విజయవంతంగా ఎగుమతి చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నైనీ తయారీ కేంద్రంలో ఈ అధిక సామర్థ్యం కలిగిన ఈహెచ్‌వీ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తయారు చేశారు. అమెరికాకు ఈ తొలి ఈహెచ్‌వీ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎగుమతి, అంతర్జాతీయ విద్యుత్ ప్రసార మార్కెట్లలో ఎస్ఎస్‌ఈఎల్ సామర్థ్యాలకు మరో ముఖ్యమైన గుర్తింపుగా నిలిచింది. అధిక సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను అత్యున్నత ఇంజినీరింగ్, నాణ్యత, పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసి, అంతర్జాతీయ యుటిలిటీ మార్కెట్ల అవసరాలను తీర్చగలిగే సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నట్లు ఎస్ఎస్ఈఎల్ తెలిపింది. ఈ మైలురాయి ద్వారా అమెరికాతో పాటు ఇతర అంతర్జాతీయ పవర్ ట్రాన్స్‌మిషన్ మార్కెట్లలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు ఎస్ఎస్‌ఈఎల్‌కు మరింత బలమైన పునాది ఏర్పడింది.
అంతర్జాతీయ విస్తరణకు నైనీ తయారీ యూనిట్ కీలకం. ఈ సందర్భంగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సీఈఓ శరత్ చంద్ర కొల్లా మాట్లాడుతూ.. అమెరికాకు మా తొలి ఈహెచ్‌వీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎగుమతి చేయడం ఎస్‌ఎస్‌ఈఎల్ అంతర్జాతీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయి అన్నారు. ఇది మా ఇంజినీరింగ్ నైపుణ్యం, తయారీ సామర్థ్యాలు, నాణ్యత పట్ల మా నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో మా ఉనికిని మరింత విస్తరించడంతోపాటు, రాబోయే 12 నుంచి 18 నెలల్లో నైనీ ట్రాన్స్‌ఫార్మర్ తయారీ యూనిట్ ద్వారా రూ.500 నుంచి 600 కోట్ల స్థాయిలో ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. యూరప్ మార్కెట్లో పవర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు అవసరమైన అనుమతులు, ధృవీకరణలు పొందేందుకు కూడా మేము చర్యలు కొనసాగిస్తున్నామని అన్నారు.
ఎస్ఎస్ఈఎల్ ప్రెసిడెంట్ సుధీర్ వెన్నం మాట్లాడుతూ.. నైనీ నుంచి అమెరికాకు మా తొలి 175 MVA, 345 kV క్లాస్ ట్రాన్స్‌ఫార్మర్‌ను విజయవంతంగా రవాణా చేయడం సంస్థకు ఒక కీలక మైలురాయి అన్నారు. కఠినమైన అంతర్జాతీయ యుటిలిటీ ప్రమాణాలకు అనుగుణంగా భారీ సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను తయారు చేసి, సరఫరా చేయగల మా సామర్థ్యాన్ని ఇది ధృవీకరిస్తోందని తెలిపారు. కడపతో పాటు నైనీని కూడా అధునాతన పవర్ ట్రాన్స్‌ఫార్మర్ మార్కెట్లకు ఒక విశ్వసనీయ ఎగుమతి కేంద్రంగా స్థాపించేందుకు ఈ విజయం దోహదపడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్రిడ్ విస్తరణ, విద్యుదీకరణ, పునరుత్పాదక ఇంధన అనుసంధానంపై భారీ పెట్టుబడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ మైలురాయి మా అంతర్జాతీయ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు, అలాగే మా ఆదాయ వనరులను మరింత విభిన్నీకరించేందుకు బలమైన పునాదిని ఏర్పరుస్తుందని మేము విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు.
షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (SSEL)ను ఏపీలోని కడప జిల్లాలో 1994లో ఎన్. విశ్వేశ్వరరెడ్డి స్థాపించారు. గత మూడు దశాబ్దాలుగా విద్యుత్, ఇంధన మౌలిక వసతుల రంగంలో తన సామర్థ్యాలను నిరంతరం విస్తరించుకుంటూ వచ్చింది. ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్, సర్వీసింగ్ సంస్థగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎస్‌ఎస్‌ఈఎల్, ప్రస్తుతం పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, రియాక్టర్లు, కండక్టర్లు, అల్లాయ్‌లు, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలు తదితర విభాగాల్లో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
అదేవిధంగా, సంస్థ తన కార్యకలాపాలను సౌర, పవన, జలవిద్యుత్ రంగాలకు విస్తరించడంతో పాటు, విద్యుత్, ఇంధన మౌలిక వసతుల ప్రాజెక్టులకోసం ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణం (EPC) సామర్థ్యాలను కూడా అభివృద్ధి చేసుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామర్థ్యం, ఇంజినీరింగ్ నైపుణ్యం, నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యతనిస్తూ, భారతదేశంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో విశ్వసనీయమైన విద్యుత్ ప్రసార పరిష్కారాలను అందించడంపై ఎస్‌ఎస్‌ఈఎల్ దృష్టి సారిస్తోంది.
1,58,000 ఎంవీఏకి చేరనున్న మొత్తం తయారీ సామర్థ్యం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ తయారీ కేంద్రాల్లో షిర్డిసాయి ఎలక్ట్రిల్‌కు సుమారు 48,000 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ తయారీ సామర్థ్యం ఉంది. రాబోయే సంవత్సరాల్లో అదనంగా 1,10,000 ఎంవీఏ తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసేందుకు సంస్థ విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తోంది. దీంతో ఎస్‌ఎస్‌ఈఎల్ మొత్తం ట్రాన్స్‌ఫార్మర్ తయారీ సామర్థ్యం సుమారు 1,58,000 ఎంవీఏకు చేరుకోనుంది.
అంతర్జాతీయ విద్యుత్ మౌలిక వసతుల మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, అధిక సామర్థ్యం కలిగిన ఈహెచ్‌వీ, పవర్ ట్రాన్స్‌మిషన్ పరికరాల తయారీ సామర్థ్యాలను ఎస్‌ఎస్‌ఈఎల్ నిరంతరం విస్తరిస్తోంది.
అమెరికాకు తొలి ఈహెచ్‌వీ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఎగుమతి చేయడం ద్వారా, అంతర్జాతీయ పవర్ ట్రాన్స్‌మిషన్ పరికరాల సరఫరా వ్యవస్థలో ఎస్‌ఎస్‌ఈఎల్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.






