Congress | ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద పనిచేస్తున్న వ్యక్తిగత సహాయకుల (పీఏల) వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల నుంచి కొందరు పీఏలు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అపాయింట్‌మెంట్ ఇప్పించడం నుంచి సిఫారసు లేఖలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించడం వరకు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.
కాంట్రాక్టర్లు తమ బిల్లుల మంజూరు కోసం ప్రజాప్రతినిధులను కలిసేందుకు ప్రయత్నించినప్పుడు, సిఫారసు లేఖలు ఇప్పించడం, టోకెన్ జాబితాలో పేర్లు చేర్చడం వంటి పనుల కోసం భారీ మొత్తాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధుల కార్యాలయాలకు వచ్చే సామాన్యులు సైతం వివిధ అవసరాల కోసం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖ కోసం రూ.5 వేలు, సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తు అప్‌లోడ్ చేసేందుకు రూ.3 వేలు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎక్కువ మొత్తంలో ఆర్థిక సాయం ఇప్పించేందుకు 10 శాతం వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఓపెన్ స్పెషల్ పికప్ శాంక్షన్ కోసం రూ.లక్ష, గురుకులాలకు నీటి సరఫరా పనుల కోసం రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు సిఫారసు లేఖల కోసం కనీసం రూ.2 లక్షలు అడుగుతున్నారనే ప్రచారం ఉంది. కళాశాల ఫీజు తగ్గింపునకు సిఫారసు లేఖ కోసం రూ.5 వేలు తీసుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు.
పోలీసు, రెవెన్యూ శాఖల్లో పోస్టింగ్‌ల సిఫారసుల కోసం కూడా భారీ మొత్తాలు డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీఐ స్థాయి అధికారికి ఫోన్ చేసి కేసు నమోదు కాకుండా చూడాలంటే రూ.10 వేలు, ఉన్నతాధికారులను సంప్రదించేందుకు అంతకంటే ఎక్కువ మొత్తం అడుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
స్థానిక పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాల్లోని అధికారులతో పరిచయాలు పెంచుకుని, తమ మాట ప్రకారమే పనులు జరిగేలా కొందరు పీఏలు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో సాయం కోసం ప్రజాప్రతినిధుల వద్దకు వచ్చే వారిని సైతం డబ్బులు అడుగుతున్నారనే ఆరోపణలు ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి.
ప్రజాసేవ చేయాల్సిన కార్యాలయాల్లో ఇలాంటి వసూళ్ల ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిగితేనే నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.






