Supreme Court: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయితే, అర్బన్ లోకల్ బాడీల ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువును పొడిగించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని వైసీపీ తన పిటిషన్‌లో కోరింది. అభ్యర్థులు నామినేషన్లు సమర్పించకుండా అడ్డంకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అందరికీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది వైసీపీ..
మరోవైపు, నామినేషన్ పత్రాలను స్వీకరించేందుకు అదనపు, ప్రత్యామ్నాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని వైసీపీ కోరింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరిగేలా వీడియోగ్రఫీ నిర్వహించాలని పిటిషన్‌లో పేర్కొంది. నామినేషన్ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు, వారి ప్రతిపాదకులకు తగిన పోలీసు రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇక, ఇప్పటికే అఫిడవిట్లు దాఖలు చేసిన అభ్యర్థులతో పాటు, నామినేషన్లు సమర్పించేందుకు ప్రయత్నించి అడ్డంకులు ఎదుర్కొన్న ఇతర అభ్యర్థుల పత్రాలను కూడా పొడిగించిన గడువులో స్వీకరించేలా ఆదేశించాలని వైసీపీ కోరింది.. అంతేకాకుండా, మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నికలపై స్టే విధించాలని కూడా పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.






