కుభీర్: సుద్ద వాగు ( Sudda Vagu ) బ్యాక్వాటర్ ద్వారా సాగునీటిని వినియోగించుకుంటూ పంటలు పండిస్తున్న రైతులకు నీటి సరఫరాలో ఆటంకాలు కల్పించవద్దని డిమాండ్ చేస్తూ శుక్రవారం కుభీర్ మండలంలోని మాలేగాం, కుంభి, లింగి గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన (Farmers Protest ) చేపట్టారు. మాలేగాం గ్రామ సమీపంలో మొండి బసవన్న వద్ద మలేగాం సర్పంచ్ శేల్కె లక్ష్మీ ఆనంద్, మాజీ సర్పంచ్ కే రేఖ శంకర్ ఆధ్వర్యంలో సుద్ద వాగు బ్యాక్ వాటర్ పరివాహక ప్రాంత రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమకు సాగునీరు అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలకు ప్రస్తుతం నీరు అత్యవసరమని తెలిపారు. ఇప్పటికే పంటల సాగు కోసం పెట్టుబడులు పెట్టామని, పంటలు చేతికి వచ్చే సమయంలో నీటిని నిలిపివేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఖరీఫ్ లో సాగుచేసిన పసుపు, శనగ, పొద్దు తిరుగుడు పంటలను సాగు చేసుకున్న రైతులు వాటి ఎదుగుదలకు అవసరమైన నీరు అందకపోతే పంటలు చేతికి రావన్నారు.
పంటలు చేతికి వచ్చే వరకు సుద్ద వాగు బ్యాక్వాటర్ ద్వారా సాగునీటిని వినియోగించు కునేందుకు ఎలాంటి అడ్డంకులు కల్పించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని మోటార్ల తొలగింపు నిర్ణయంపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు .






