Saluru | రాజకీయాల్లో ఎప్పుడు ఏ సమీకరణం మారుతుందో చెప్పలేం! పదవి కోసం వేసిన ఎత్తుగడలు ఒక్కోసారి అనూహ్య మలుపులు తిరుగుతుంటాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో టీడీపీ నేత వైకుంఠపు హర్షవర్ధన్ వ్యవహారం ఇప్పుడు స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. మున్సిపల్ చైర్పర్సన్ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో తన ఎనిమిదేళ్లుగా ప్రేమించిన గుళ్ల మంజీరాను ఉన్నఫళంగా పెళ్లి చేసుకున్న ఆయనకు.. చివరకు ఆ పదవి జనసేన పార్టీకి దక్కడం ఊహించని పరిణామంగా మారింది.
రిజర్వేషన్ ప్రకటనతో మారిన లెక్కలు
సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని బీసీ మహిళకు కేటాయిస్తూ రిజర్వేషన్ ఖరారు కావడంతో, ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు పురుష నేతలకు నేరుగా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ కౌన్సిలర్ హర్షవర్ధన్ తన రాజకీయ భవిష్యత్తుపై కొత్తగా ఆలోచించినట్లు ప్రచారం సాగింది. తాను పోటీ చేయలేకపోయినా, తన భార్యను బరిలోకి దింపితే పదవిని దక్కించుకోవచ్చనే ఆలోచనతో ఆయన అడుగులు వేసినట్లు స్థానికంగా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే తన ప్రియురాలు మంజీరాను పెళ్లి చేసుకుని, ఆమెను ఎన్నికల్లో నిలబెట్టాలని ఆశపడ్డారు. మరో ఆరు నెలల తర్వాత వివాహం చేసుకోవాలని తొలుత నిర్ణయించుకున్న ఈ జంట.. రిజర్వేషన్ ప్రకటన తర్వాత అనూహ్యంగా పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులను ఒప్పించి సాలూరులోని స్థానిక ఆలయంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ పెళ్లి వెనుక రాజకీయ వ్యూహం ఉందంటూ అప్పట్లో ప్రచారం మొదలైంది. తన భార్యకు టీడీపీ టికెట్ ఇప్పించి మున్సిపల్ చైర్పర్సన్ పదవికి పోటీ చేయించాలని హర్షవర్ధన్ భావించినట్లు వార్తలు వచ్చాయి.
పెళ్లి జరిగింది.. కానీ సీటు దక్కలేదు!
అంతా అనుకున్నట్లే జరుగుతుందని భావించిన తరుణంలో కూటమి సీట్ల సర్దుబాటు కొత్త మలుపు తిప్పింది. సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ స్థానం జనసేన పార్టీకి కేటాయించినట్లు సమాచారం. దీంతో తన భార్యను టీడీపీ తరఫున బరిలోకి దింపాలనుకున్న హర్షవర్ధన్ ఆశలకు గండిపడింది. రిజర్వేషన్ ప్రకటనతో మొదలైన రాజకీయ లెక్కలు.. పెళ్లి వరకు వెళ్లి, చివరకు కూటమి సీట్ల పంపకంతో మరో మలుపు తిరిగాయి. ఎనిమిదేళ్ల ప్రేమకు పెళ్లితో ముగింపు పలికిన ఈ జంట విషయంలో, రాజకీయంగా మాత్రం హర్షవర్ధన్ ఆశించిన ఫలితం దక్కలేదు. సాలూరు చైర్పర్సన్ స్థానం జనసేనకు వెళ్లడంతో ఈ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది.






