
అన్నమయ్య జిల్లా పుంగనూరులో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాన్వాయ్ పై జరిగిన రాళ్ళ దాడి సంచలనంగా మారింది. ఈ దాడిలో ఎంపీ వాహనంతో పాటు ఆయన అనుచరులకు చెందిన పలు ఇతర వాహనాలు కూడా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. దీంతో ఒక్కసారిగా పుంగనూరు పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ మరింత పెద్దది కాకుండా మరియు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.
మరోవైపు ఈ ఘర్షణ ఇక్కడితో ఆగకుండా మరింత ముదిరింది. ఎంపీ మిథున్ రెడ్డి వాహనంపై దాడికి ప్రతిచర్యగా ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కీలక నేత మధు రాయల్ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు, టీడీపీ అభ్యర్థులపై సైతం వైసీపీ మూకలు దాడికి తెగబడినట్లు సమాచారం అందుతోంది. ఈ ఉమ్మడి ఘర్షణల్లో టీడీపీ నేత మధు రాయల్కు తీవ్ర గాయాలవడంతో ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పుంగనూరు నియోజకవర్గంలో మొదటి నుండి పెద్దిరెడ్డి కుటుంబానికి, టీడీపీ శ్రేణులకు మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘర్షణలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియను అడ్డుకునే వ్యూహంతోనే ఇరు పార్టీలు పరస్పరం దాడులకు దిగడంతో సామాన్య ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రస్తుతం పుంగనూరులో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ భరిత వాతావరణం ఇంకా కొనసాగుతోంది.
The post పుంగనూరులో ఏం జరుగుతోంది..? పోలీసుల గాల్లోకి కాల్పులు..! appeared first on Telugu Rajyam.





