సేవింగ్స్ అకౌంట్ ప్రతీఒక్కరూ కలిగి ఉంటారు. రోజువారీ నగదు అవసరాల కోసం నిధులు బదిలీ చేసుకునేందుకు ఈ అకౌంట్ ఎక్కువమంది వాడుతూ ఉంటారు. అయితే ఈ ఖాతాలో ఎంత డబ్బులు అయినా జమ చేయవచ్చు. కానీ ఐటీ శాఖ కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. మీరు పొదుపు ఖాతాలో ఒక ఆర్ధిక సంవత్సరంలో ఎక్కువ డబ్బులు జమ చేస్తే ఐటీ శాఖ మీ లావాదేవీలపై నిఘా పెట్టవచ్చు. మీ ఆదాయానికి మించి, ఐటీ రిటర్న్స్లో పొందుపర్చిన వివరాల కంటే పెద్ద మొత్తంలో మీ అకౌంట్లో నగదు జమ అయినా లేదా బదిలీ చేసినా ఐటీ రాడార్లోకి వెళతారు. అసలు సేవింగ్స్ అకౌంట్లలో ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ జమ చేస్తే ఏమవుతుంది? అనేది చూద్దాం.
రూ.10 లక్షల కంటే ఉంటే నష్టమేనా..?
పెద్ద మొత్తంలో ఒకేసారి మీ సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు జమ అయినా లేదా ట్రాన్సాఫర్ చేసినా మీ లావాదేవీలను ఐటీ శాఖకు బ్యాంకులు నివేదిస్తాయి. ఇలాంటి సమయంలో మీ ఆదాయం, మీ అకౌంట్లో జమ అయిన నగదు మధ్య వ్యత్యాసాలు ఉంటే ఐటీ శాఖ నోటీసులు పంపించవచ్చు. మీ అకౌంట్లోని నగదు ఎక్కడ నుంచి వచ్చిందనే విషయంలో ఆధారాలు అడగొచ్చు. ఒక్క అకౌంట్ కాదు.. మీకు సంబంధించిన అన్ని సేవింగ్స్ అకౌంట్లలో ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు జరిపితే ఐటీ శాఖకు మీ వివరాలు వెళతాయి. మీ ఆదాయం, లావాదేవీల మధ్య పొంతన లేకపోతే ఐటీ నోటీసులు రావొచ్చు. ఇలాంటప్పుడు నగదు ఎక్కడ నుంచి వచ్చిందనేది ఐటీ శాఖకు ఆధారాలు సమర్పించారు.
రూ.10 లక్షలు దాటితే ట్యాక్స్ చెల్లించారా..?
సేవింగ్స్ అకౌంట్లో రూ.10 లక్షల కంటే ఎక్కువ జమ చేసినంత మాత్రాన ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మీ నగదు, దాని మూలం, ఆదాయపు పన్ను నిబంధనలు బట్టి ఉంటుంది. వ్యవసాయం, ఆస్తి విక్రయం, ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన ఆదాయం నుంచి వచ్చిన డబ్బులు అయితే వాటికి సంబంధించిన ఆధారాలను భద్రపర్చుకోవాలి. దీని వల్ల మీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సేవింగ్స్ అకౌంట్లో ఎంత డబ్బులు అయినా దాచుకోవచ్చు. కానీ ఆ నగదుకు సరైన రుజువులు కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.






