
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పీక్స్‌కు చేరిన వేళ, కూటమిలోని భాగస్వామ్య పక్షమైన జనసేన పార్టీ అంతర్గత వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన విమర్శలు, చర్చలు మొదలయ్యాయి. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కీలకమైన మేయర్, చైర్మన్ పీఠాలను దక్కించుకోవాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న ఒక పెద్ద మైనస్ పాయింట్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. అదే.. కీలక స్థానాల్లో పోటీ చేయడానికి జనసేన గూటిలో సరైన, బలమైన అభ్యర్థులు లేకపోవడం.
గత 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ జనసేన పార్టీ ఇదే తరహా అభ్యర్థుల కొరతను ఎదుర్కొంది. పొత్తులో భాగంగా తమకు దక్కిన నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు బలమైన లీడర్లు లేకపోవడంతో.. పవన్ కళ్యాణ్ చివరకు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులను రాత్రికి రాత్రే జనసేనలోకి చేర్చుకుని బి-ఫారాలు ఇచ్చారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్.. అవనిగడ్డ నియోజకవర్గం. టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్‌ను జనసేనలోకి తెచ్చి మరీ పవన్ టికెట్ ఇచ్చారు. కేవలం అవనిగడ్డ మాత్రమే కాదు, మరో మూడు నాలుగు నియోజకవర్గాల్లోనూ ఇదే ‘టీడీపీ టు జనసేన’ వలస ఫార్ములాను అమలు చేసి ఎన్నికల గండం గట్టెక్కారు.
సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూటమి అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లయినా.. జనసేన సొంతంగా నాయకత్వాన్ని తయారు చేసుకోలేకపోయిందనే విమర్శలకు తాజా పరిణామాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిష్టాత్మక మేయర్ స్థానాల్లో జెండా పాతేందుకు జనసేన మళ్లీ టీడీపీ నేతల వైపే ఆశగా చూస్తోంది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వంగవీటి రాధా వ్యవహారమే దీనికి తాజా ఉదాహరణ. టీడీపీ నాయకుడిగా ఉన్న రాధాకు జనసేన కండువా కప్పి, గ్లాసు గుర్తుపై మేయర్ అభ్యర్థిగా బరిలోకి దించేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే చర్చలు జరపడం హాట్ టాపిక్‌గా మారింది.
పార్టీ కోసం ఏళ్ల తరబడి జెండాలు మోసి, కష్టకాలంలో పవన్ వెంట నడిచిన సొంత జనసైనికులకు కాదని.. కేవలం ఎన్నికలు రాగానే పక్క పార్టీ లీడర్లను తెచ్చి నెత్తిన కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయమనే ప్రశ్నలు అంతర్గతంగా వినిపిస్తున్నాయి. “క్యాడర్ మాది.. లీడర్ మీవాడా..?” అంటూ జనసేన స్థానిక నాయకత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ సైతం జనసేనపై విమర్శల దాడి పెంచింది. సొంతంగా అభ్యర్థులను నిలబెట్టుకునే దమ్ము లేని పార్టీ.. రేపు కార్పొరేషన్లను ఏం పాలిస్తుందని ప్రశ్నిస్తోంది. ఎన్నికల ముంగిట పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ఈ ‘వలస నేతల’ రాజకీయం జనసేనకు మేయర్ పీఠాలను తెచ్చిపెడుతుందో లేక సొంత క్యాడర్ తిరుగుబాటుకు కారణమవుతుందో చూడాలి.
The post అభ్యర్థులు లేక అద్దె నేతలతోనే మేయర్ పీఠాలపై పవన్ కన్ను..? appeared first on Telugu Rajyam.





